రెక్కలు కట్టుకుని ఆకాశంలో ఎగరాలనుకోను
నా కోసం ఆకాశం బ్రతికితే చాలు
… ఒక్కోసారి చిల్లులు పడిన మబ్బుల కుండలు
ఒక్కోసారి వెచ్చటి కిరణాల సూర్యుని స్పర్శ
ఇవంటూ ఉంటే….నేను బ్రతికున్నట్టే!
భూమిని గజాల్లెక్కన కొని…ఇది నాదనుకోవాలనుకోను
నా కోసం అవని ఆకారం చెరగకుండా ఉంటే చాలు
చెట్టును బలంగా నిలబెట్టే వేళ్ళు…నిండిన జలాశయాలు
పువ్వుల ముఖాల్లో జీవితంపై నిశ్చింత
పువ్వంటూ పూస్తే….నేను తిండి గింజలు సంపాదించినట్టే!
గాలితో గాలివాటంగా తిరగాలనుకోను
నా కోసం నేనెక్కడున్నా, స్వచ్చమైన పవనాలు వీస్తే చాలు
విశ్వమంతా పరుచుకున్న సమతౌల్యం
చిరునవ్వుల ముత్యాల నిండా పేరుకున్న సౌభ్రాతృత్వం
ఇవంటూ ఉంటే….”నేను” అత్యంత ధనవంతుడ్నే!!!